నూతన విద్యావిధానం-2020 ముఖ్యాంశాలు
కేంద్ర విద్యా శాఖ 2020 సంవత్సరం జూలై 29న ప్రకటించిన జాతీయ విద్యా విధాానాన్ని (ఎన్.ఇ.పి. 2020ను) విద్యాశాఖ వెబ్ సైట్ (https://www.mhrd.gov.in/sites/upload_files/mhrd/files/NEP_Final_English_0.pdf)లో అందుబాటులో ఉంచారు. కొత్త జాతీయ విద్యా విధానం ప్రత్యేక అంశాలు ఇలా ఉన్నాయి:-
1. ప్రీ ప్రైమరీ స్థాయినుంచి 12వ తరగతివరకూ అన్ని స్థాయిల్లో పాఠశాల విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం;
2. 3నుంచి ఆరేళ్ల వరకూ వయస్సున్న పిల్లలందరికీ ముందస్తు బాల్యంలో నాణ్యమైన రక్షణ, నాణ్యమైన విద్య;
4. 5+3+3+4 పద్ధతిలో కొత్త తరహా పాఠ్యాంశాలు, బోధనా పద్ధతుల వ్యవస్థ;
5. ఆర్ట్స్, సైన్స్,..పాఠ్యాంశాలు, పాఠ్యేతర అంశాలు.., వృత్తిపరమైన, విద్యా సంబంధమైన అంశాల మధ్య ఎలాంటి కఠినమైన విభజనా లేని పద్థతి;
6. సరైన పునాదులతో కూడిన అక్షరాస్యత, సంఖ్యాశాస్త్ర అధ్యయనం కోసం జాతీయ స్థాయి కార్యక్రమం;
7. బహుభాషా వాదం, భారతీయ భాషల అధ్యయనంపై శ్రద్ధ; కనీసం ఐదవ తరగతివరకూ, ప్రత్యేకించి 8వ తరగతివరకూ లేదా అంతకు మించిన స్థాయివరకూ మాతృభాష/సొంత భాష/స్థానిక భాష/ప్రాంతీయ భాషే బోధనా మాధ్యమం.
8. మధింపు సంస్కరణలు – పాఠశాల సంవత్సరంలో రెండు పర్యాయాల వరకూ బోర్డు పరీక్షలు. ఒక ప్రధాన పరీక్ష. అవసరమైతే ఇంప్రూవ్ మెంట్ పరీక్ష;
9. జాతీయ స్థాయిలో కొత్త మదింపు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, పరాఖ్ -పి.ఎ.ఆర్.ఎ.కె.హెచ్ (
ప్రతిభ తీరు అంచనా, సమీక్ష, విశ్లేషణ, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసంకోసం విజ్ఞానం);
10. సమాన ప్రాతిపదికపై సమ్మిళిత విద్య – సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలకు దూరమైన వర్గాలకు (ఎస్.ఇ.డి.జి.లకు) ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం;
11, అవకాశాలకు దూరమైన ప్రాంతాలు, గ్రూపులకోసం విడిగా ఒక లైంగిక సమ్మిళిత నిధి, ప్రత్యేక విద్యా మండలం;
12. ఉపాధ్యాయుల నియామకం, ప్రతిభ ఆధారిత పనితీరుకోసం దృఢమైన, పారదర్శకమైన ప్రక్రియ;
13. పాఠశాల సముదాయాలు, గ్రూపుల ద్వారా అన్ని రకాల వనరులు అందుబాటులో ఉండేలా చూడటం;
14. ప్రభుత్వ పాఠశాల ప్రమాణాల ప్రాధికార సంస్థను (ఎస్.ఎస్.ఎస్.ఎ.ని) ఏర్పాటు చేయడం;
15. పాఠశాల విద్య, ఉన్నత విద్యా వ్యవస్థలో వృత్తి విద్యకు అవకాశం;
16. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని (జి.ఇ.ఆర్.ను) 50శాతానికి పెంచడం;
17. బహుళ అవకాశాల ప్రవేశం, నిర్గమన అవకాశాలతో కూడిన సంపూర్ణమైన బహుళ పాఠ్యాంశాల అధ్యయనం;
18. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఎ.)కి అవకాశం;
19. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఏర్పాటు;
20. బహుళ పాఠ్యాంశాలను పోల్చి చదివే విద్యా, పరిశోధనా వ్యవస్థను విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేయడం;
21. జాతీయ పరిశోధనా ఫౌండేషన్ (ఎన్.ఆర్.ఎఫ్)ను ఏర్పాటు చేయడం;
22. ‘సరళమైనదైనా పటిష్టమైన’ నియంత్రణా వ్యవస్థ;
23. వైద్యవిద్యను, న్యాయవిద్యను మినహాయిస్తూ ఉపాధ్యాయ విద్యతోపాటు ఉన్నత విద్యా రంగానికి ప్రోత్సాహం ఇవ్వడానికి అందుబాటులో ఉండేలా భారతీయ ఉన్నత విద్యా కమిషన్ (హెచ్.ఇ.సి.ఐ.) పేరిట ఏక ఛత్ర సంస్థ ఏర్పాటు. వివిధ అంశాలపై స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థల ఏర్పాటు. ప్రమాణాలను నిర్దేశించడానికి సార్వత్రిక విద్యా మండలి, నిధులకోసం ఉన్నత విద్యా గ్రాంట్స్ కొన్సిల్, గుర్తింపు ప్రక్రియకోసం నేషనల్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (ఎన్.ఎ.సి.), నియంత్రణ వ్యవహారాల కోసం జాతీయ ఉన్నత విద్యా నియంత్రణా మండలి (ఎన్.హెచ్.ఇ.ఆర్.సి.).
24. స్థూల నమోదు నిష్పత్తిని (జి.ఇ.ఆర్.ను) పెంచేందుకు సార్వత్రిక, దూరవిద్యా వ్యవస్థ విస్తరణ.
25. విద్యను అంతర్జాతీయ స్థాయికి పెంపొందించడం
26. ఉన్నత విద్యా వ్యవస్థలో వృత్తి విద్య (ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్) ఒక అంతర్గత భాగంగా ఉంటుంది. స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే సాంకేతిక విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయాలు, న్యాయ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వీటితో పాటు ఇతర అధ్యయన అంశాల సంస్థలు బహుళ పాఠ్యాంశాల సంస్థలుగా ఎదిగేందుకు అవకాశం కల్పించడం
27. ఉపాధ్యాయ విద్య– నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ స్టేజ్…ప్రత్యేక అంశం అధ్యయనంతో, ప్రత్యేక బ్యాచిలర్ డిగ్రీ. మార్గదర్శకత్వం కోసం జాతీయ కార్యక్రమ రూపకల్పన.
28. జాతీయ విద్యా సాంకేతిక వేదిక (ఎన్.ఇ.టి.ఎఫ్.) ఏర్పాటు. అధ్యయనం, మధింపు, ప్రణాళిక, పరిపాలన, తదితర అంశాల మెరుగుదల కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై స్వేచ్ఛగా పరస్పరం అభిప్రాయాలను పంచుకునే వేదికగా ఎన్.టి.ఎఫ్.ను ఏర్పాటు చేయడం. విద్య అన్ని స్థాయిల్లోకి తగిన విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేయడం.
29. యువతలో, వయోజనుల్లో వందశాతం అక్షరాస్యత సాధించడం
30. ఉన్నత విద్య వాణిజ్యంగా, వ్యాపారంగా మారకుండా నియంత్రించేందుకు తగిన తనిఖీలు, సమతూకాలతో బహుళ యంత్రాగ వ్యవస్థల ఏర్పాటు.
31. ఒకే రకమైన తనిఖీ ప్రమాణాలతో లాభాపేక్షలేని సంస్థలుగా విద్యా సంస్థలను తీర్చిదిద్దడం
32. విద్యా రంగంలో ప్రభుత్వ పెట్టుబడిని స్థూల జాతీయోత్పత్తిలో 6శాతానికి సాధ్యమైనంత త్వరగా చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కలసికట్టుగా పనిచేయడం
33. నాణ్యమైన విద్యపై పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకృతమై ఉండేలా సమన్వయం కోసం కేంద్ర విద్యా సలహా బోర్డును మరింత బలోపేతం చేయడం.
34. విద్యా మంత్రిత్వ శాఖ: విద్య, అధ్యయనం తదితర అంశాలపై దృష్టిని కేంద్రీకరించేందుకు వీలుగా మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా తిరిగి పేరు మార్చడం అభిలషణీయం.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలతో పాటుగా అన్ని భాగస్వామ్య వర్గాలతో సవివరమైన సంప్రదింపుల ప్రక్రియ ముగిసిన అనంతరం 2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానం ఖరారైంది. 2020 సవంత్సరపు జాతీయ విద్యా విధానాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయాలంటూ విద్యా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం ఇచ్చింది. జాతీయ విద్యా విధానం ఇతివృత్తం, అమలు తీరుపై చర్చించడం, సూచనలు స్వీకరించడం లక్ష్యంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2020 సెప్టెంబరు 8వ తేదీనుంచి 25వరకూ ‘శిక్షక్ పర్వ్’ పేరిట ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. “ఉన్నత విద్యా పరివర్తనలో జాతీయ విద్యా విధానం పాత్ర” అనే అంశంపై గవర్నర్లతో ఒక సమ్మేళనాన్ని కూడా విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ సమ్మేళనంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, వివిధ రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సిలర్లు, ఇతర ప్రముఖులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా 2020వ సంవత్సరపు జాతీయ విద్యావిధానంపై భాగస్వామ్య వర్గాలనుంచి సానుకూలమైన, ప్రతిస్పందన వెల్లువెత్తింది.
ప్రధాన స్రవంతిలోని విద్య కంటే, వొకేషనల్ విద్య తక్కువ స్థాయిదనే భావన నెలకొన్నట్టు నూతన జాతీయ విద్యావిధానం గుర్తించింది. అందుకే,..వొకేషనల్ విద్య సామాజిక స్థాయిపై ప్రస్తుతం ఉన్న అపోహను తొలగించి, వొకేషనల్ విద్యా కోర్సులను ప్రధాన స్రవంతిలోని విద్యా కోర్సులతో మమేకం చేయాలన్న లక్ష్యాన్ని జాతీయ విద్యా విధానం నిర్దేశించుకుంది. అన్ని విద్యా సంస్థల్లో దశలవారీ గా ఈ లక్ష్యం పూర్తి చేయాలని కూడా నిర్దేశించుకుంది. ఈ దిశగా, మాధ్యమిక పాఠశాలలు పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐ.టి.ఐ.లు), పాలిటెక్నిక్ సంస్థలు, స్థానిక పరిశ్రమలతో కలసి పనిచేయవలసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నైపుణ్య పరిశోధనా శాలలను (స్కిల్ ల్యాబ్ లను) ఏర్పాటు చేస్తారు. హబ్ అండ్ స్పోక్ నమూనాలో ఏర్పాటయ్యే ఈ స్కిల్ ల్యాబ్ ల సదుపాయాన్ని ఇతర పాఠశాలలు కూడా వినియోగించుకునే అవకాశమిస్తారు.
ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాల వరకూ అన్ని స్థాయిల్లో విద్య నాణ్యతను పెంచడం అనేది నిరాటంకంగా కొనసాగుతున్న ప్రక్రియ. ఈ దిశగా ప్రస్తుతం అనేక చర్యలు కూడా తీసుకున్నారు. పాఠశాల విద్య కోసం సమగ్రశిక్షా పేరిట కేంద్ర ప్రాయోజిత పథకం అమలవుతోంది. పాఠశాల విద్య అన్ని స్థాయిల్లో సమాన ప్రాతిపదికన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రీ స్కూల్, ప్రాథమిక, ప్రాథమికోన్నత, మాధ్యమిక, సీనియర్ సెకండరీ విద్య స్థాయి వరకూ ‘పాఠశాల’ అనేది నిరంతర ప్రక్రియగా ఈ పథకం పేర్కొంటోంది. ఇక, ఉన్నత విద్యలో కూడా పలు పథకాలు అమలులో ఉన్నాయి. రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్ (రూసా-ఆర్.యు.ఎస్.ఎ.), విద్యా పరిశోధనా కార్యకలాపాల ప్రోత్సాహ పథకం (ఎస్.పి.ఎ.ఆర్.సి.), విద్యా వ్యవస్థపై ప్రపంచ స్థాయి కార్యక్రమం (జి.ఐ.ఎ.ఎన్.), పరిశోధన, సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞాన ప్రభావిత కార్యక్రమం (ఇంప్రింట్-ఐ.ఎం.పి.ఆర్.ఐ.ఎన్.టి.), సాంకేతిక విద్యా నాణ్యతా మెరుగుదల కార్యక్రమం (టి.ఇ.క్యు.ఐ.పి.), యువత, ఆశావహుల క్రియాశీలక అధ్యయనంపై స్టడీ వెబ్స్ (స్వయం-ఎస్.డబ్ల్యు.వై.ఎ.ఎం.), జాతీయ డిజిటల్ లైబ్రరీ క్యాంపస్ అనుసంధాన కార్యక్రమం, ఉచ్చతర్ ఆవిష్కార అభియాన్, ఉన్నత్ భారత్ అభియాన్, సామాజిక శాస్త్రాల్లో ప్రభావపూరిత పరిశోధన (ఇంప్రెస్-ఐ.ఎం.పి.ఆర్.ఇ.ఎస్.ఎస్), సృజనాత్మక విజయాలపై అటల్ ర్యాంకింగ్ సంస్థలు (ఎ.ఆర్.ఐ.ఐ.ఎ), జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ వ్యవస్థ (ఎన్.ఐ.ఆర్.ఎఫ్.) వంటి పథకాలను ఉన్నత విద్యలో నాణ్యతను పెంపొందించేందుకు అమలు చేస్తున్నారు. ఉన్నత విద్య, సాంకేతిక విద్యలో నాణ్యతను పెంపొందించేందుకు విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం (యు.జి.సి.), అఖిల భారతీయ సాంకేతిక విద్యా మండలి (ఎ.ఐ.సి.టి.ఇ.) కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తూవస్తున్నాయి.
విద్యా రంగంలో కేంద్రంతో పాటుగా, వివిధ రాష్ట్రాలు కూడా ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంచేందుకు జాతీయ విద్యా విధానం నిర్ద్వంద్వంగా ఆమోదం తెలుపుతోంది. విద్యా రంగంలో ప్రభుత్వ పెట్టుబడి స్థూల జాతీయోత్పత్తిలో ఆరుశాతానికి చేరేలా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేయనున్నాయి. కేంద్ర మానవ వనరుల మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఈ రోజు లోక్ సభలో ఇచ్చిన లిఖిపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.
*****